ఏపి బ్యూరో, డైలీ రిపోర్ట్ (మందా అజయ్ బాబు ) మే 28;
పుస్తకం ముఖ్యం కాదని, పేర్లు రాసుకోవాలని, అధికారంలోకి రాగానే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వైసీపీ అధినేత జగన్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న జగన్ తమకు పుస్తకాలు అవసరం లేదన్నారు. పేర్లు మాత్రం ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోవాలని సూచించారు. పల్నాడులో జరిగిన జంట హత్యల వెనక టీడీపీ నేతలే ఉన్నారని ఎస్పీ బహిరంగంగానే ప్రకటించారని, ఆ వాహనం కూడా ఎవరిదో తెలుసునని, అయితే తర్వాత మాత్రం పిన్నెల్లి సోదరులపై కేసులు నమోదు చేశారన్నారు.
వరస కేసులతో… టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో తాజాగా ఆర్కే పేరును కూడా పెట్టి వేధిస్తున్నారని జగన్ అన్నారు. అక్రమ మైనింగ్ జరగలేదని అధికారులు నివేదిక ఇచ్చినా కాకాణి గోవర్థన్ రెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందన్న జగన్ కార్యకర్తల కష్టాలను తాను పరిశీలిస్తున్నానని, వారి బాగోగులను చూసుకుంటానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి టీడీపీ డ్రామాలు చేస్తుందని, అక్రమ కేసులు బనాయిస్తూ భయపెట్టాలని ప్రయత్నిస్తుందన్నారు. ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని జగన్ అన్నారు. మహానాడు మొత్తం జగన్ ను తిట్టడానికే పెట్టినట్లుందని ఆయన ఎద్దేవా చేశారు.